మృతదేహం కోసం ఎదురుచూపులు ఉన్నత చదువుల కోసం కష్టపడి తల్లిదండ్రులు తమ కుమారుడిని అమెరికాకు పంపితే ఏడాదిన్నరలోపే రోడ్డు ప్రమాదంలో తనయుడు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గౌడ్స్ కాలనీకి చెందిన నీరజ్ గౌడ్ అనే యువకుడు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతనితోపాటు జిల్లా కేంద్రానికి చెందిన స్నేహితుడు శ్రీధర్ అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు.
బోధన్ పట్టణానికి చెందిన నళిని శంకర్ గౌడ్ అనే దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి నసురుల్లాబాద్ మండలం నెమ్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. తనయుడు నీరజ్ గౌడ్ ఉన్నత చదువుల కోసం ఏడాదిన్నర క్రితం అమెరికాకు వెళ్లాడు.
అమెరికాలోని న్యూ హెవెన్ సిటీలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. ఈనెల 16వ తేదీన స్నేహితుడితో కలిసి బ్రిడ్జి పోర్ట్ ప్రాంతానికి వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పోలీస్ పెట్రోలింగ్ కారును ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా నీరజ్ గౌడ్ మృతి చెందాడు. శ్రీధర్ కి సైతం తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో ఐదు నిమిషాల్లో రూమ్ కు చేరుకో నే అవకాశం ఉండగా రోడ్డు ప్రమాదం సంభవించింది.
అమెరికా పోలీసులు మృతుడి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు. తమకుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నీరజ్ గౌడ్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
