కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం వాడీవేడిగా సాగింది. సమావేశం ఆరంభమైన వెంటనే బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పోడియం వద్దకు చేరుకుని అధికారుల తీరును నిరసించారు. తమ వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, అధికారిక కార్యక్రమాలపై కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు.
ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లకు తెలియకుండానే అధికారులు నేరుగా వార్డుల్లో పనులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.కౌన్సిలర్ అరికల ప్రభాకర్‌యాదవ్ మాట్లాడుతూ.. తన వార్డులో నెల రోజుల కిందట జేసీబీతో పనులు ప్రారంభించి, మధ్యలోనే యంత్రాన్ని తీసుకెళ్లారని తెలిపారు.
అదే పనిని ఇప్పుడు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మళ్లీ జేసీబీతో చేయిస్తున్నారని, ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పనుల విషయమై అధికారులను అడిగితే ‘షబ్బీర్‌అలీ చెప్పారు.. నయీమ్ చెప్పారు’ అంటూ సమాధానాలు వస్తున్నాయని మండిపడ్డారు.
వార్డుల్లో ఏ సమస్య ఉన్నా ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కౌన్సిలర్లేనని, అలాంటప్పుడు తమకు సమాచారం ఇవ్వకుండా పనులు నిర్వహించడం సరికాదని బీఆర్‌ఎస్ సభ్యులు అన్నారు. అధికారులు తమను పక్కనపెట్టి నేరుగా వార్డుల్లో పర్యటించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే పరిస్థితి కొనసాగితే కౌన్సిలర్లుగా ఉండటం ఎందుకని ప్రశ్నిస్తూ.. అవసరమైతే రాజీనామా చేసి, అధికారులు, నాయకులే వార్డుల్లో పనులు చూసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారుల వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు నల్ల కండువాలను కౌన్సిల్ టేబుల్‌పై ఉంచి తమ నిరసనను వ్యక్తం చేశారు.
సమావేశంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వార్డుల అభివృద్ధి, సమస్యలపై తమకు పూర్తి సమాచారం ఇవ్వాలని, ప్రజాప్రతినిధులుగా తమ పాత్రను గౌరవించాలని వారు డిమాండ్ చేశారు.
