నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియనున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
గడువు ముగిసిన వెంటనే ప్రచార నిమిత్తం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నేతలు, కార్యకర్తలు, ఇతర సిబ్బంది తక్షణమే నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా ఎవరైనా స్థానికేతరులు ఆయా ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ప్రచారం ముగిసిన తర్వాత పోలీసులు ప్రత్యేక బృందాలతో లాడ్జిలు, కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాళ్లలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు పోలీస్ యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.
