పేకాట స్థావరంపై ‘చీతా ఫోర్స్’ మెరుపుదాడి చేసింది. ఈ ఘటనలో 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 58,490 నగదుతో పాటు సెల్ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నందిపేట్ పోలీసులు వెల్లడించారు.
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆదేశాల మేరకు, ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో ఈ దాడి జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూత్పల్లి గ్రామం సమీపంలో ఉన్న ఒక గెస్ట్ హౌస్‌పై చీతా ఫోర్స్ బృందం ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. అక్కడ పేకాట ఆడుతున్న 10 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుల నుంచి నగదు, 10 సెల్ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, సొత్తును తదుపరి విచారణ నిమిత్తం నందిపేట్ ఎస్హెచ్ఓకు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో పేకాట, జూదం, మత్తు పదార్థాల విక్రయాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
