నిజామాబాద్ జిల్లా సిరికొండ, భీంగల్, కమ్మర్పల్లి మండలాల్లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లను సందర్శించి, వసతి సదుపాయాలను పరిశీలించారు. సిరికొండ మండలం చిమన్ పల్లి గ్రామంలో కొనసాతున్న జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్, తరగతి గదులు, డార్మెటరీ, కిచెన్, టాయిలెట్స్ లను పరిశీలించారు.
సరైన వసతులు లేకుండా కిచెన్, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వహణ తీరును చక్కదిద్దాలని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అదే ప్రాంగణంలో కొనసాగుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, అవసరమైన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. అనంతరం కమ్మర్పల్లి మండలం బషీరాబాద్, భీంగల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు అనుసంధానంగా నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను కలెక్టర్ సందర్శించారు.
ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఇంకనూ అవసరం ఉన్న మౌలిక వసతుల గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భీంగల్ ఏ.టీ.సీ కేంద్రం తుది దశ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించాలని, ఆయా కోర్సులలో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
