ఆర్మూర్ లో చోటుచేసుకున్న ఘటన -ఆధ్య అనే మూడేళ్ల చిన్నారి మృతి -మున్సిపల్ అధికారులు కళ్లు తెరవాలని స్థానికుల ఆగ్రహం మున్సిపల్ అధికారుల నిండు నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రాంనగర్ లో చోటుచేసుకుంది .
తమకు ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇంటి ఎదుట డ్రైనేజీలో శవమై తేలడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ కు చెందిన ప్రశాంత్, జ్యోతి అనే దంపతులు బిల్డింగ్ పెయింటింగ్ చేసుకొంటూ జీవిస్తారు.
గత సంవత్సర కాలంగా రాంనగర్ లో అద్దెకు ఉంటున్న ఇంటి ఎదుట గల డ్రైనేజీ లో చిన్నారి ఆద్య ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయింది.
ఘటన జరిగినప్పుడు ఎవరు చూడకపోవడంతో నీట మునిగి చనిపోయింది . సుమారు మూడు గంటల తర్వాత ఆద్య మృతదేహం కనిపించడంతో చిన్నారి మృతదేహాన్ని బయట తీశారు.
రామ్ నగర్ లో డ్రైనేజీతోపాటు పరిసరాల పరిశుభ్రత అస్తవ్యస్తంగా మారింది. దీంతో మున్సిపల్ అధికారులపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
