HomeTelanganaNizamabadఈసీ నోటీసులకు వారంలో సమాధానం..వ్యక్తిగత వాదనలకు అవకాశం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఈసీ నోటీసులకు వారంలో సమాధానం..వ్యక్తిగత వాదనలకు అవకాశం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం

తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇస్తామని పార్టీ తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు.

అనంతరం పార్టీ ప్రతినిధులకు వ్యక్తిగతంగా హాజరై తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈసీ నోటీసులకు పార్టీ సమాధానం ఇచ్చిన తర్వాత వారి వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

పార్టీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈసీ సూచనల మేరకు తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై అభ్యంతరాలు కోరుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలిపారు.

రెండు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను మాత్రమే ఈసీ తమకు పంపిందని, వాటిపై ఇప్పటికే వివరణ కూడా సమర్పించామని చెప్పారు.

అయితే పార్టీ పేరుపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయని పేర్కొంటూ, మరో మూడు పేర్లను సూచించాలని ఈసీ నోటీసులు జారీ చేసిందన్నారు. తమ పార్టీ పేరుపై వచ్చిన అన్ని అభ్యంతరాలను తెలుసుకునే హక్కు తమకు ఉందని, అందువల్ల వాటి పూర్తి వివరాలను అందజేయాలని ఈసీని కోరినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. ముందుగా ఈసీ నోటీసులకు సమాధానం ఇవ్వాలని సూచించారు. వారం రోజుల్లో సమాధానం సమర్పిస్తామని పార్టీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అనంతరం పార్టీ పేరుపై తుది నిర్ణయం తీసుకునే ముందు హియరింగ్ నిర్వహించి తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పార్టీ సమాధానం అనంతరం వ్యక్తిగత వాదనలకు అవకాశం ఇవ్వాలని ఈసీని ఆదేశించింది.


హైకోర్టు ఆదేశాలపై టీఆర్‌ఎస్ వర్గాల స్పందన
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. తొలుత ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నామని, తమ దరఖాస్తులోని మూడో పేరైన ‘తెలంగాణ రక్షణ సేన’ పేరునే కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాల స్వీకరణ కోసం ప్రకటించిందని పేర్కొన్నాయి.

తమ పార్టీ పేరుపై వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని ఈసీ చెబుతున్నప్పటికీ, అవి ఏమిటో తమకు తెలియజేయడం లేదని ఆరోపించాయి. ఈసీ అనుమతితోనే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండా గద్దెలు ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించాయి.

వారం రోజుల్లో ఈసీ నోటీసులకు సమాధానం సమర్పిస్తామని, అనంతరం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యక్తిగతంగా ఈసీ ఎదుట హాజరై పార్టీ పేరుపై పూర్తి వివరణ ఇస్తారని తెలిపాయి. ఇప్పటికే తెలంగాణలో టిఆర్ఎస్ సంక్షిప్త నామంతో రెండు రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చిందని, వాటిలో ఒకటి 2023లో, మరొకటి 2024లో రిజిస్ట్రేషన్ పొందాయని పేర్కొన్నాయి.

2026లో తాము కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి పార్టీ రిజిస్ట్రేషన్ కోరుతున్నామని, అప్పట్లో లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని ప్రశ్నించాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు గెలిచేది న్యాయమేనని స్పష్టం చేశాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments