నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మచ్చుకైనా కనిపించని సిబ్బంది
గంటల తరబడి వేచి చూస్తున్న క్రయ విక్రయదారులు.. పట్టించుకోని వైనం..
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల పనితీరు ‘అస్తవ్యస్తం’గా మారింది. సమయపాలన పాటించాల్సిన అధికారులే కార్యాలయానికి డుమ్మా కొడుతుండటంతో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బుధవారం ఉదయం 10:30 గంటలు దాటినా కార్యాలయంలో అధికారుల ఆచూకీ లేకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకే విధుల్లో ఉండాల్సిన సిబ్బంది, పదిన్నర దాటినా కార్యాలయానికి చేరుకోలేదు. సెక్షన్ ఆఫీసర్ల నుంచి మొదలుకొని క్లర్కుల వరకు చాలామంది సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
దూరాభారం నుంచి రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చిన ప్రజలు, వృద్ధులు ఆఫీసు బయట పడిగాపులు కాస్తున్నారు. స్లాట్లు బుక్ చేసుకుని సకాలంలో వచ్చిన వారు అధికారుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కార్యాలయంలో అధికారులు లేకపోవడంపై అడిగే నాథుడే కరువయ్యారు. అధికారుల గైర్హాజరుతో కార్యాలయం జనం సందడితో కిక్కిరిసిపోయినప్పటికీ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ మచ్చుకైనా కనిపించడం లేదు. “రిజిస్ట్రేషన్ల కోసం వేల రూపాయల ఫీజులు కడుతున్నా.. కనీస సౌకర్యాలు కల్పించకపోగా, అధికారుల నిర్లక్ష్యం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది” అని పలువురు బాధితులు వాపోతున్నారు.
బయోమెట్రిక్ హాజరు ఉన్నప్పటికీ అధికారులు తమ ఇష్టానుసారంగా రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ పనితీరును మెరుగుపరచాలని, విధులకు గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
