గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన మైనింగ్ దందాఫై పోలీసు శాఖ ఎట్టకేలకు డేగ కన్ను వేసింది. అక్రమాలకు పాల్పడిన అభియోగాల మీద మేయర్ భర్త ను బైండోవర్ చేసారు. అసలు జిల్లాలో ఈ దందా లో అడ్డుదారులు తొక్కిన గుత్తే దార్ల చిట్టా సిద్ధం చేసి నట్లుగా పోలీసు శాఖ ఉదరగొడుతుంది. అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారి భరతం పడుతామని బీరాలు పలుకుతుంది.
తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా జిల్లాలోఅక్రమ మైనింగ్ దందా యథేచ్ఛగా సాగడంతో తలా ఒక్కరు తమవంతు పాత్ర పోషించారు. పదేళ్లు తమ కళ్ళ ముందే దందా సాగుతున్న తమకేమి పట్టనట్లుగా ఉండి పోయిన యంత్రాంగం ,నిఘా వ్యవస్థ ఇప్పుడు హడావుడి చేయడం ఫై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గత పదేళ్ల కాలం లో జిల్లాలో అనేక ప్రాంతాల్లో మైనింగ్ దందాలు యదేచ్చగా సాగుతున్నాయి. మొరం ..క్వారీ …ఇసుక ఇవ్వన్ని మైనింగ్ దందాలే .
ఎదో మొక్కబడిగా అనుమతులు తీసుకోవడం ఆ ముసుగులో అక్రమాలు తెరలేపడం షరా మాములే కదా .రెవెన్యూ గనుల శాఖ ల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన తర్వాతే మొరం ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారు. అలాగే క్వారీలు కూడా . నిర్దేశిత ప్రాంతాల్లో నిర్దిష్టమైన కొలతల మేరకే తవ్వకాలు చేయాలి ఇసుక, మొరం రవాణా చెయ్యాలి ,ఆయా ప్రాంతాల్లో తవ్విన ఇసుక మొరం లను పర్మిట్ లతోనే ఆయా ప్రాంతాలకు తరలించాలి. కానీ ఎదో మొక్కబడిగా అనుమతులు పొందే గుత్తేదార్లు లెక్కకు మించి ఇసుక మొరం తవ్వేస్తూ గుట్టుగా తరలిస్తున్నారు.
మొరం ఇసుక తవ్వడానికి అయితే స్థానిక ఎమ్మెల్యే మొదలుకొని జెడ్పిటిసి ఎంపీపీ సర్పంచ్ లను సైతం ఎదో రకంగా మేనేజ్ చెయ్యాలి.కానీ వాటిని దర్జాగా రవాణా చేయాలంటే పోలీసు రెవెన్యూ అధికారులను ముందే మామూళ్ల ఒప్పందాలు చేసుకోవాల్సిందే. ఇదేమి గుట్టుగా సాగేది కాదు. గుత్తేదార్లు రెవెన్యూ పోలీసు అధికారులకు మామూళ్లు ముట్టజెప్పకే వాహనాలు రోడ్డెక్కుతాయి. ఇందులో దాపరికమేమి లేదు అందరికి తెలిసిందే.అంతే కాదు రచ్చ చేయకుండా స్థానిక మీడియా ను సైతం నయానో భయానో మేనేజ్ చేయాల్సిందే.
ఎవరెవరికి ఎంత మొత్తం ఇవ్వాలనేది గుత్తేదార్లు ముందే ఓ అంచనాకు వచ్చేస్తారు.తమ గిట్టుబాటు ఏ మాత్రం తగ్గకుండానే ముడుపులు వెదజల్లుతారు.గత పదేళ్లు ఈ అక్రమ మైనింగ్ దందా మూడుజెసిబి లు ఆరు టిప్పర్ లు అన్న చందంగా సాగింది. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దందాలు ఓ కన్నేసింది. జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణా రావు వీటి మీద విచారణకు ఆదేశించారు. రెండు మాసాల తరువాత పోలీసు శాఖ కార్యాచరణ మొదలు పెట్టింది. మేయర్ నీతూ కిరణ్ భర్త ను బైండోవర్ చేసారు. ఆయన గతంలో మొరం అక్రమ రవాణా చేశారనేది పోలీసులు అభియోగం.
కానీ ఎట్టకేలకు కొరడా ఝుళిపిస్తున్న పోలీస్ శాఖ యాక్షన్ కేవలం గుత్తేదారుల పరిమితం లేదంటే యదేచ్చగా మామూళ్లు మెక్కిన పోలీసు రెవెన్యూ అధికారులతో పాటు మీడియా స్థానిక నేతల భరతం పడుతారా ?లేదా ?అనేది ఉత్కంఠ గా మారింది