కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు.
రెండు రోజులుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో తడిసిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ధాన్యం రాశులు తడిసి పోతున్నాయని వాపోయారు.
కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యమూ తడిచిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై కల్లల మీద పోసిన ధాన్య రాశులకు కిందకు వర్షపు నీరు చేరడంతో ధాన్యం తడిసిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కల్లలపై ఉన్న ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది.
అలాగే, ధాన్యంతో నిండిన సంచుల కిందకు కూడా నీరు చేరింది. కల్లల్లో ధాన్యాన్ని అరబోసి 20 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు స్పందించడం లేదని ఆగ్రహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుభవం లేని వారికి అప్పగించడం వల్ల సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు జరగలేదు.
దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారనీ తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో, కల్లాలో రోడ్లపై నిల్వ ఉన్న ధాన్యం తడిసి ముద్దవుతున్నా అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
తడిసిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఇంతవరకు పరిశీలించలేదు. ప్రభుత్వం నుంచి అప్పటి వరకు ఎలాంటి స్పందనా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారనీ పేర్కొన్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వేంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేశారు.
అలాగే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులకు జరిగినటువంటి నష్టాన్నికి ప్రభుత్వం వెంటనే నష్టపరివారని అందించాలని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరించారు.
