రుణమాఫీ పై ప్రభుత్వం పై ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న రైతులు – నేటి సమావేశం తర్వాత కార్యాచరణ వెల్లడించే అవకాశం – రుణమాఫీ తో ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ సర్కార్ర రాజకీయ చైతన్యానికి అడ్డా అయినా ఆర్మూరు గడ్డ మరో రైతు ఉద్యమానికి సిద్ధమవుతుందా…?
అంటే అవును అనే సమాధానం వస్తుంది. గతంలో ఎర్ర జొన్నల మద్దతు ధర కోసం ఉద్యమించిన రైతులు నేడు రుణమాఫీ కోసం ఉద్యమించడానికి సన్నద్ధమవుతున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ మూడు విడుతల్లో ఆగస్టు 15 లోపల రైతులందరి బ్యాంకు ఖాతాలలో రుణమాఫీ నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది.
రైతాంగ సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నామని చెబుతూ రాష్ట్ర బడ్జెట్లో అత్యధిక నిధులను కేటాయించింది.
అయినా రుణమాఫీ ప్రక్రియలో మొదటి మూడు విడతల్లో తమకు రుణమాఫీ వర్తిస్తుందని ఆశించి బంగపడ్డ రైతులంతా ఒక్క తాటిపైకి వచ్చారు.
ఆర్మూర్, బాల్కొండ , నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని ఆయా మండలాలకు చెందిన రైతులంతా ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించేందుకు ఒక్కటి అయ్యేందుకు ఆర్మూర్ మార్కెట్ కమిటీ తరలివచ్చారు.
ఆర్మూర్ మార్కెట్ కమిటీ వద్ద తరలివచ్చిన రైతులకు గేటుకు తాళం వేసి ఉండడంతో తాళం తీయమని సిబ్బందిని ఎంత వారించినా వారు తీయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రైతు సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీలు రైతులు సమావేశం అవుతామంటే ఎందుకు తీయడం లేదని సిబ్బందిని నిలదీస్తే, తమకు ఉన్నతాధికారుల నుంచి గేటు తెరవడానికి ఎటువంటి ఆదేశాలు లేవని సమాధానం ఇచ్చారు.
దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులంతా ఆర్మూర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
రైతు రుణమాఫీ రాని రైతుల కోసం ప్రభుత్వానికి నిరసనగలం విప్పేందుకు రైతులు తమ కార్యచరణను సిద్ధం చేసుకుంటున్నారు. రైతు రుణమాఫీతో ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ సర్కార్ ఈ సమస్యను పరిష్కరించడానికి ఏ రీతిగా అడుగులు వేస్తుందో వేచి చూడాల్సిందే…!