జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ఎవరో చేసిన చిన్న పొరపాటు వందలాది మంది రోగుల ప్రాణాల మీదకు రావడమే కాకుండా, భారీ ఆస్తి నష్టానికి దారితీసే పరిస్థితిని తెచ్చింది. క్షణాల్లో ఆరో అంతస్తు వరకు వ్యాపించడంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఫైర్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో ఓ రోగి బంధువు బీడీ తాగి, అది పూర్తిగా ఆరకుండానే అక్కడే ఉన్న స్మోక్ పైపు సమీపంలో పరేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు.. ఆ నిప్పు రవ్వల వల్ల పైపునకు మంటలు అంటుకున్నాయన్నారు.
పైపు గుండా పొగ అత్యంత వేగంగా పైకి పాకడంతో.. నిమిషాల వ్యవధిలోనే ఆరో అంతస్తు వరకు దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఆరో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించిన వైద్యులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
విషయాన్ని గమనించిన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు.ఆరో అంతస్తులో ఆస్పత్రికి సంబంధించిన విలువైన వైద్య పరికరాలు, మందుల నిల్వలు ఉన్నాయి.
మంటలు ఆ అంతస్తుకు విస్తరించి ఉంటే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించేదని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడం, మంటలను ఆర్పివేయడంతో పెను ముప్పు తప్పిందని వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.
అశ్రద్ధే అసలు కారణం..ఆస్పత్రి వంటి సున్నిత ప్రాంతాల్లో ధూమపానం నిషేధమని బోర్డులు ఉన్నప్పటికీ, కొందరు రోగుల బంధువుల అశ్రద్ధ వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంలో భద్రతను మరింత కఠినతరం చేయాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
