జాతీయ జెండాకు సెల్యూట్ చెయ్యాల్సిన ఓ పోలీసు అధికారి ఏకంగా పార్టీ జెండాకు కార్యకర్తల తోపాటు సెల్యూట్ చేశాడంటూ మాజీ మంత్రి ఫొటోలతో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్‌ఐ మహేందర్ ఆ కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేయడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.
రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పోలీసు అధికారి ఒక రాజకీయ పార్టీ జెండాకు సెల్యూట్ చేయడం కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థను వారికీ అనుకూలంగా మలచుకొని ఎంతగా నిర్వీర్యం చేసిందో స్పష్టం అయిందన్నారు .ఇటువంటి చర్యలు పోలీసు వ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై,ఇతరులపై అధికార పార్టీ ఆదేశాల మేరకు అక్రమ కేసులు పెడుతూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే విధంగా పోలీసులు వ్యవహరించడం బాధాకరమని,పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారనేందుకు కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో జరిగిన ఘటన నిదర్శనమని ఆయన అన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వెంటనే విచారణ జరిపించి,ఎస్ ఐ మహేందర్ పై తగిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
