HomeCRIMEనిర్మల్ టూ నిజామాబాద్.. వయా ఆర్మూర్.. రెండు జిల్లాల్లో నాలుగు లూటీలు.. మహిళలే లక్ష్యంగా వరుస...

నిర్మల్ టూ నిజామాబాద్.. వయా ఆర్మూర్.. రెండు జిల్లాల్లో నాలుగు లూటీలు.. మహిళలే లక్ష్యంగా వరుస చైన్‌స్నాచింగ్‌లు రంగంలోకి దిగిన సీపీ.. 8 ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర ముఠాపై అనుమానం

రాత్రి చీకటిని ఆసరాగా చేసుకున్న దొంగల ముఠా తెల్లవారుజామున వరకు రెచ్చిపోయింది. నిర్మల్‌లో దోపిడీతో మొదలైన నేరాల పరంపర ఆర్మూర్‌లో చోరీ, నిజామాబాద్‌లో వరుస చైన్‌స్నాచింగ్‌లతో కొనసాగింది.

పోలీసులు తేరుకునేలోపే ముఠా జిల్లా దాటే ప్రయత్నం చేసింది.టాటా సుమోలో సంచరించిన నలుగురు సభ్యుల ముఠా పోలీసులకు సవాల్ విసురుతూ పరారైంది.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాటా సుమోలో వచ్చిన నలుగురు దుండగులు ముందుగా నిర్మల్ జిల్లాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి పాల్పడ్డారు.

అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన వారు ఆర్మూర్ పట్టణంలోని ఓ మెడికల్ షాపు షట్టర్ ధ్వంసం చేసి సుమారు రూ.1.10 లక్షల నగదును అపహరించారు. అనంతరం అదే వాహనంలో మాక్లూర్ మండలం శ్రీనగర్ కాలనీకి చేరుకున్నారు.

ఉదయం సుమారు 4.55 గంటల సమయంలో పని నిమిత్తం వెళ్తున్న లక్ష్మి అనే మహిళను అడ్డగించిన దుండగులు, అడ్రస్ అడిగే నెపంతో మాటల్లో పెట్టారు. ఆమె అప్రమత్తమయ్యేలోపే మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుని టాటా సుమోలో పరారయ్యారు.

అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి దుబ్బా ప్రాంతానికి చేరుకున్న ముఠా ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కోవడంతో పాటు చెవికమ్మలను కూడా తెంపేందుకు ప్రయత్నించింది.

ఒక చెవికమ్మను లాక్కున్న దుండగులు, మరోటి తీసే క్రమంలో బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఆమె భర్త బయటకు పరుగెత్తుకుంటూ వచ్చాడు.

దీంతో దుండగులు అక్కడి నుంచి కూడా వేగంగా పరారయ్యారు.వరుస ఘటనల సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దుబ్బా ప్రాంతానికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో వెంటనే 8 ప్రత్యేక బృందాలతో ముమ్మరం చేశారు.

నగరంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.దుండగులు ప్రయాణించిన టాటా సుమో వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాల్లోని కెమెరాల దృశ్యాలను సేకరించి ముఠా కదలికలను విశ్లేషిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

ముఠా ప్రయాణ మార్గాన్ని గుర్తించే పనిలో దర్యాప్తు బృందాలు నిమగ్నమయ్యాయి. నిందితులు మహారాష్ట్ర వైపు పారిపోయి ఉండొచ్చనే అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసులతోనూ సమన్వయం చేస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments