క్రికెట్ ముగింపు కార్యక్రమంలో సిపి సాయి చైతన్య..యువత బంగారు భవిష్యత్తును చిత్తు చేస్తున్న మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.మత్తు వీడి మైదానాలకు రావాలని పేర్కొన్నారు.
నిజామాబాద్ డివిజన్ పరిధిలోని ముగ్పాల్ పోలీస్ శాఖ ఆద్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరముగా ఉండేందుకు యువత కోసం గత నాలుగు రోజులుగా మండల పరిధిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
ఈ టోర్నమెంట్ లో మండలంలోని 13 గ్రామాల నుండి 13 టీంలను ఏర్పాటు చేసి ” ప్రెసిడెంట్ పాఠశాల మైదానం యందు ఈ టోర్నమెంట్ ని నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలనీ సూచించారు. ప్రస్తుతం మన సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితమవుతోంది.
ఇది ఒక ప్రమాదకరమైన మార్గం. ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగుపెడితే , జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉందనీ అన్నారు. యువత దేశ భవిష్యత్తు, మీరు ఆరోగ్యంగా ఉంటూ , మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయనీ పేర్కొన్నారు.
మిమ్మల్ని వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, సహజీవనాన్ని, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయి. మన బాధ్యతలు మనమే గుర్తించాలనీ అన్నారు. మంచి స్నేహితులను , మంచి అలవాట్లను ఎంచుకోవాలి. మీరు చేసిన ప్రతి మంచి పని , మీ కుటుంబాన్ని , సమాజాన్ని గర్వపడేలా చేస్తుందనీ పేర్కొన్నారు.
అనంతరం క్రీడాకారులకు బహుమతులు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి , సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. సురేష్ కుమార్ , ముగ్పాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జెడ్. సుస్మిత, క్రికెట్ జట్ల యువత, పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
