HomeCRIMEప్రభుత్వ జాగ ప్రైవేట్ పాగా..?ఫిర్యాదులు చేసినా కదలని అధికారులు15 రోజులుగా ఫిర్యాదులు.. 'వస్తాం.. చూస్తాం'తోనే సరిపెడుతున్న...

ప్రభుత్వ జాగ ప్రైవేట్ పాగా..?ఫిర్యాదులు చేసినా కదలని అధికారులు15 రోజులుగా ఫిర్యాదులు.. ‘వస్తాం.. చూస్తాం’తోనే సరిపెడుతున్న అధికారులు

ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాకోరులు ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ గద్దల్లా వాలుతున్నారు. ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుని హద్దురాళ్లు పాతించడం, ఫెన్సింగ్‌ వేయడం చేస్తున్నారు.

కబ్జాలకు పాల్పడుతూ.. రాజకీయ అండదండలతో సర్కారు భూములను చెరబడుతున్నారు. సందులు, నాలాలు, చెరువులు, గుట్టలు.. ఇలా ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా కబ్జాలు చేస్తూ వెంటనే నిర్మాణాలు చేపడుతున్నారు.

భూములు, ప్లాట్ల రేట్లు విపరీతంగా పెరగడంతో భూ కబ్జానే సంపాదనగా ఎంచుకుంటున్నారు. కబ్జాదారులకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా అధికారులకు పట్టించుకోవడం లేదు.

నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్ నాందేవ్‌వాడలో ప్రభుత్వానికి చెందిన విలువైన మున్సిపల్ స్థలం కబ్జానే ఇందుకు నిదర్శనం. ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన స్థలాన్ని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆక్రమించి పాఠశాల నిర్వహిస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

స్థానికుల కథనం ప్రకారం, గతంలో స్ప్రింగ్ స్కూల్ నిర్వహించిన ప్రాంగణాన్ని ఖాళీ చేయించిన అనంతరం అదే స్థలంలో ప్రస్తుతం ‘ఒలింపియాడ్’ పేరుతో మరో ప్రైవేట్ పాఠశాలను ప్రారంభించారు. ప్రభుత్వ స్థలంలోనే గేట్లు ఏర్పాటు చేసి తమ సొంత ఆస్తిలా వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై గత 15 రోజులుగా మున్సిపల్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు కనిపించకపోవడం తో అనుమానాలకు తావిస్తోంది. ఎన్ని సార్లుఫిర్యాదుచేసినా “వస్తాం… చూస్తాం…” అనే హామీలు తప్ప క్షేత్రస్థాయిలో తనిఖీలు గానీ, ఆక్రమణ తొలగింపు చర్యలు గానీ చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలకు అవసరమైన అన్ని అనుమతులు పూర్తిగా లేవని, ఫైర్ సేఫ్టీ, వెంటిలేషన్ వంటి ప్రాథమిక ప్రమాణాల విషయంలోనూ నిబంధనలు పాటించడం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక కారణాలేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఆ మున్సిపల్ స్థలంలో మహిళా భవనం నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు ఎన్నోసార్లు కోరాయి. కానీ ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన స్థలం ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్ ఆధీనంలో ఉండడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. మున్సిపల్, విద్యాశాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ ఆక్రమణ కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఒక శాఖ మరో శాఖపై బాధ్యత నెట్టేస్తుండగా, ప్రభుత్వ భూమి మాత్రం రోజురోజుకూ ప్రైవేట్ ఆధీనంలో బలపడుతోందని అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని స్థలంపై సమగ్ర విచారణ జరిపి, ఆక్రమణ నిజమైతే తొలగించి ప్రజల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments