నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.అత్యధిక పోలింగ్ భీమ్ గల్ మున్సిపాలో నమోదు కాగా అత్యల్పంగా నిజామాబాద్ నగరంలో ఓటింగ్ శాతం నమోదు అయ్యింది.
బుధవారం ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు.
మధ్యాహ్నం 1 గంట వరకు అందిన సమాచారం ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా సగటున 39.68 శాతం ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ కార్పొరేషన్: 35.49%, ఆర్మూర్ మున్సిపాలిటీ: 47.93%, బోధన్ మున్సిపాలిటీ: 50.69%, భీమ్గల్ మున్సిపాలిటీ: 51.53% ఓటింగ్ నమోదయ్యింది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మొదటి రెండు గంటల పాటు మందకొడిగా సాగింది. అయితే ఎండ తీవ్రత పెరగకముందే ఓటు వేయాలని భావించిన నగర వాసులు ఉదయం 9 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో 11 గంటల సమయానికి జిల్లాలో ఓటింగ్ శాతం 22.54కు చేరింది.
జిల్లా ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ఎక్కడా అంతరాయం కలగకుండా సాగుతోంది. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగర పరిధిలో ఓటింగ్ శాతం కొంత తక్కువగా ఉన్నప్పటికీ, గ్రామీణ నేపథ్యం ఉన్న మున్సిపాలిటీల్లో (బోధన్, భీమ్గల్) ఓటర్లు అత్యధికంగా తరలివస్తుండటం గమనార్హం.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ మరింత పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా నీడలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది.
