టాటా ఏసీ-ఐచర్ వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డుపై రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సారంగపూర్ వైపు వెళ్తున్న టాటా ఏసీ వాహనం, ఆర్నూర్ వైపు వెళ్తున్న ఐచర్ వాహనం బైపాస్ రోడ్డు వద్ద వేగంగా వచ్చి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో టాటా ఏసీ వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో, అందులో ఉన్న వ్యక్తి వాహనం క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. తీవ్ర గాయాలవ్వడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద శబ్దాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇనుప రాడ్ల సహాయంతో వాహన భాగాలను తొలగించి, మృతదేహాన్ని బయటకు తీశారు.
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
