దిక్కు మొక్కులేని అభాగ్యులు, అనాథ శవాలకు ఆఖరి మజిలీలో ఆత్మబంధువులై, సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తూ ‘ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ’ మరోసారి తమ మానవత్వాన్ని చాటుకుంది.
కాలం కన్నెర్ర చేసినా, కుటుంబం వెలివేసినా, మతి స్థిమితం కోల్పోయినా… ఎటునుంచి వచ్చారో, ఎక్కడికి పోతున్నారో తెలియని అనేకమంది అనాథలు రోడ్లపైనే దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కడుపు నిండా తిండి లేక, అనారోగ్యం పాలై చివరికి రోడ్ల పక్కనే తనువు చాలించడం ఈ అభాగ్యుల పరిస్థితికి నిదర్శనం.
ఈ నేపథ్యంలో, వివరాలు తెలియని ఓ అనాథ వ్యక్తి గత వారం రోజుల క్రితం మృతిచెందాడు. స్థానికులు, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ మృతదేహం అనాథగా మిగిలిపోయింది.
ఈ విషయాన్ని గుర్తించిన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆ అనాథ శవానికి సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ ‘ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ’ను ఆశ్రయించారు.
దీంతో పోలీసుల విజ్ఞప్తి మేరకు, శనివారం ఆ యువత సంస్థ సభ్యులు వెంటనే స్పందించారు. అనాథ శవానికి వారే తమ స్వంత ఖర్చులతో చితిని ఏర్పాటు చేసి, సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని చూసిన స్థానికులు, అభాగ్యులకు ఆఖరి ఘన వీడ్కోలు పలికిన యువత సేవానిరతిని ప్రశంసించారు.
ఈ మానవీయ కార్యక్రమంలో ‘ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ’ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, యూవీ ఫౌండేషన్ సభ్యుడు సతీష్ మానవత్వం చూపిన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సాయిలు తదితరులు పాల్గొన్నారు.
