ఇటీవల ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి, వాటి కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం నిజామాబాద్ 4వ టౌన్, డిచ్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఏడు కీలక ప్రమాద స్థలాలను మోటార్ వాహన తనిఖీ అధికారులు, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా పరిశీలించారు.
ఏంవీఐలు పవన్ కల్యాణ్, వాసుకి, శ్రుతిలతో కూడిన బృందం, 4వ టౌన్ ఎస్ఐ మరియు డిచ్పల్లి పోలీసు సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాలను సందర్శించారు. ప్రమాదాలు జరగడానికి గల సాంకేతిక కారణాలు, రహదారి మలుపులు, సైన్ బోర్డుల లేమి వంటి అంశాలను నిశితంగా పరిశీలించారు.
వరుసగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ‘బ్లాక్ స్పాట్స్’గా పరిగణించి, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సిద్ధం చేశారు.రహదారి నిర్మాణంలో ఉన్న లోపాలు లేదా వాహనాల అతి వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయా అనే కోణంలో వివరాలు సేకరించారు.
ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు, రేడియం సూచికలు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.సమన్వయంతోనే నివారణపోలీస్ మరియు రవాణా శాఖల సమన్వయంతోనే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా ప్రమాదకర మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సేకరించిన డాటాను విశ్లేషించి, త్వరలోనే శాశ్వత నివారణ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
