ఎంపీ లాడ్స్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో కొందరు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కమిషన్ల దందాకు తెరలేపారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధి పనుల కోసం కేటాయిస్తున్న నిధుల్లో కొందరు అధికారులు వాటాలు అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎంపీ పేర్కొన్నారు. “ఎవరెవరు కమిషన్లు తీసుకుంటున్నారో, ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో నా వద్ద పూర్తి చిట్టా ఉందనీ ద్వజమెత్తారు.
ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదు” అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అధికారుల తీరును గమనిస్తున్నానని, అందరూ తమ పద్ధతి మార్చుకోవాలని అరవింద్ హెచ్చరించారు. ఒకవేళ అవినీతి ధోరణి ఇలాగే కొనసాగితే, వచ్చే ‘దిశ’ సమావేశంలో సదరు అధికారుల పేర్లను ఆధారాలతో సహా బహిరంగంగా వెల్లడిస్తానని ఆయన హెచ్చరించారు.
అభివృద్ధి పనులు పారదర్శకంగా జరగాలని, ఎక్కడా నిధుల దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ఆయన గుర్తు చేశారు.
