మెడికల్ కళాశాలలో అవగాహన సదస్సు.. పోస్టర్ల విడుదల..వైద్య విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతాయుత పౌరులుగా మెలుగుతూనే.. ర్యాగింగ్, మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య సూచించారు.
గురువారం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్, మత్తు పదార్థాల నివారణ, సైబర్ క్రైమ్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ర్యాగింగ్ అనేది విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేసే తీవ్రమైన నేరమని, దీనికి పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1908 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో సే నో టు డ్రగ్స్.. ఎస్ టు లైఫ్’ అని నినాదాలు చేయించారు.అనంతరం సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వినియోగంలో కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ సెక్యూరిటీపై నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
అనంతరం డ్రగ్స్ నివారణకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను అతిథులు విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ మాట్లాడుతూ.. వైద్య కళాశాలలో ర్యాగింగ్ రహిత వాతావరణం ఉందని, జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్, ఆర్‌ఎన్‌సీసీ డీఎస్పీ సోమనాథం, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, అడ్వకేట్ ఆరెట్టి నారాయణ, డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ కిశోర్, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ రఘుపతి, అధ్యాపకులు నాగరాజు మరియు పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులందరితో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా, సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
