ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కోరుతూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ యోగితా రానా వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుని నమ్ముకొని 95% జర్నలిస్టులు వేతనాలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నత విద్య కల్పించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.
కావున ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించేలా కృషి చేయాలని కోరుతున్నామన్నారు. జర్నలిస్టుల కోరిక మేరకు విద్యాశాఖ కమిషనర్ యోగిత రానా సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చి సంబంధిత కలెక్టర్కు, జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
