కామారెడ్డి పట్టణంలో గుండెలను పిండేసే విషాదం చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచాల్సిన కన్నతండ్రే ముగ్గురు ఆడబిడ్డల ప్రాణాలు తీసి రాక్షసుడిలా మారాడు. ఆర్థిక ఇబ్బందులో లేక మరేదైనా కారణమో కానీ, ముగ్గురు చిన్నారులను నిర్దయగా చెరువులో నెట్టి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళ్లితే..ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు.. సీపత్ (8), అయాత్ (7), మరియం (5).
ఈ ముగ్గురు పిల్లలు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు గాలిస్తుండగా.. పిల్లలు తప్పిపోయారంటూ ఇస్మాయిల్ నమ్మబలికాడు. అయితే, పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.పోలీసులు కాలనీలోని సిసి కెమెరాలను పరిశీలించగా, అసలు విషయం బయటపడింది.
తండ్రి ఇస్మాయిల్ స్వయంగా తన ముగ్గురు కుమార్తెలను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించగా, చిన్నారులను పెంచలేక తానే చెరువులో తోసేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం.నడక నేర్చుకున్న నాటి నుంచి కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కటికవాడు కావడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. అమాయకపు చూపులతో, ఆటపాటలతో సందడి చేసే ఆ ముగ్గురు చిన్నారులు ఇప్పుడు లేరన్న వార్త తెలియడంతో కాలనీవాసులు కన్నీటిపర్యంతమవుతున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దారుణానికి దారితీసిన పూర్తి కారణాలను ఆరా తీస్తున్నారు.
