రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్పల్లి నగేష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అగౌరవపరచడం కేటీఆర్ అవివేకానికి, అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను వంచించడమే తప్ప చేసిందేమీ లేదని నగేష్ రెడ్డి విమర్శించారు.
“దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఇలా ఏ ఒక్క హామీనైనా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందా?” అని ఆయన ప్రశ్నించారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్‌దేనని ధ్వజమెత్తారు.
అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేశామన్నారు. రూ. 22 వేల కోట్ల రైతు రుణమాఫీతో పాటు, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి నిదర్శనమని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. కనీసం ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నిలబడే సంస్కారం కూడా లేని కేటీఆర్..
అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమై అబద్ధపు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.ఇకనైనా కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తాం.
ప్రజల్లో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుంది.. ఫామ్ హౌస్‌లో కూర్చుంటే కాదనీ ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రమ్, సేవదల అధ్యక్షులు సంతోష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
