జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనుల కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు.
శనివారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో భూసేకరణ అంశంపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారి పనులకు అవసరమైన భూసేకరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను ఆయా జిల్లాల వారీగా చర్చించారు.
భూములు కోల్పోయిన వారికి అందించాల్సిన పరిహారం, ఇప్పటికే పూర్తయిన పరిహారం చెల్లింపులు, మార్కెట్ రేటు, భూమి అప్పగించడంలో జాప్యం జరుగుతున్న చోట అందుకు గల కారణాలు తదితర విషాయల గురించి సీ.ఎస్ కలెక్టర్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జాతీయ రహదారుల నిర్మాణాలు, విస్తరణ పనులపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్న నేపధ్యంలో, భూసేకరణ అంశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సీ.ఎస్ సూచించారు.
ఇప్పటికే పరిహారం చెల్లింపు పూర్తయిన భూమిని స్వాధీనం చేసుకోవాలని, అభ్యంతరాలు ఉన్న వారితో మాట్లాడి భూసేకరణకు సహకరించేలా చూడాలని అన్నారు. భూసేకరణ విషయంలో నెలకొని ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, జాతీయ రహదారి సంస్థకు భూములు స్వాధీనం చేయాలని ఆదేశించారు.
భూసేకరణ కోసం అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నాయని, పనులు చేపట్టేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలు కూడా సమాయత్తం అయి ఉన్నందున భూసేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చొరవ చూపాలని సూచించారు.
ఆయా సెక్షన్ల పరిధిలో ఎంత పని పూర్తయ్యింది, ఇంకా ఎంత మిగిలి ఉంది, ఎక్కడ పెండింగ్ ఉంది అన్నది పరిశీలన జరుపుతూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేందుకు వీలుగా అవసరమైన భూమిని సేకరించి నేషనల్ హైవే అథారిటీకి అప్పగించాలని అన్నారు.
అటవీ భూముల సేకరణకు సత్వర అనుమతుల విషయంలో ప్రత్యేక చొరవ కనబర్చాలని సూచించారు. భూ సేకరణ ఇబ్బందులను అధిగమించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనుల కోసం నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 74 హెక్టార్ల భూమికి సంబంధించి అవార్డు ప్రక్రియ పూర్తయ్యిందని సీ.ఎస్ దృష్టికి తెచ్చారు.
కోర్టు స్టే కారణంగా మరో 19.3 హెక్టార్ల భూ సేకరణ ప్రక్రియ నిలిచిందని, ఇటీవలే కోర్టు స్టే తొలగినందున సత్వరమే భూసేకరణను పూర్తి చేస్తామని అన్నారు.
వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఎఫ్ఓ వికాస్ మీనా, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ డీ-సెక్షన్ పర్యవేక్షకులు శ్రీనివాస్, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
