ఇందల్వాయి మండలంలోని లింగాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దారుణ హత్యకు గురైన సర్పంచ్ ఇమ్మడి గోపి అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోస్టుమార్టం అనంతరం గోపి మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చిన బంధువులు, మద్దతుదారులు..
అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.హత్య జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బాధితులు పోలీసులను ప్రశ్నించారు. ఒకవైపు నిందితులను అరెస్ట్ చేయకుండా, మరోవైపు వారి ఇళ్ల చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించి వారికే రక్షణ కల్పించడం ఏంటని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “మాకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదు..
అవసరమైతే మృతదేహంతో జాతీయ రహదారిపైకి వెళ్లి రాస్తారోకో చేస్తాం” అని వారు హెచ్చరించారు. ఈ హత్య కేసులో మరో కీలక వ్యక్తి పాత్ర ఉందని, అతని పేరును పోలీసులు ఎందుకు బయటపెట్టడం లేదని గ్రామస్తులు నిలదీశారు. బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాల్సిందేనని పట్టుబట్టారు.
దీంతో లింగాపూర్‌లో డిచ్ పల్లి సీఐ, ఎస్ఐ,పోలీస్ సిబ్బంది,భారీ బలగాలను మోహరించారు. బాధితులను శాంతింపజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.
