భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఇందూరుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు మాదాసు స్వామి యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ ప్రకటించారు.
స్వామి యాదవ్ బాల్యం నుంచే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీలో క్రియాశీల నాయకుడిగా పనిచేశారు. దశాబ్దాలుగా బీజేపీలో నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు.
ముఖ్యంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంతోపాటు బీసీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కృషి చేశారని పార్టీ నాయకత్వం పేర్కొంది.బీసీల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను తెలంగాణలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆనంద్‌గౌడ్ సూచించారు.
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓబీసీ మోర్చాను మరింత బలోపేతం చేయాలని కోరారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి మాదాసు స్వామి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
నాయకత్వం సూచించిన ప్రతి పనిని కర్తవ్యంగా భావించి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. పార్టీ సిద్ధాంతాల కోసం జీవితాంతం కృషి చేస్తానని, బీసీల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.
