నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. సుభాష్‌నగర్‌లో తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దొంగలు, ఇంట్లో ఉన్న విలువైన లాకర్ తో పరారయ్యారు.స్థానికులు తెలిపిన కథనం మేరకు.. సదరు ఇంటి యజమాని వృత్తిరీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
సోమవారం రాత్రి సమయం చూసి దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన వారు, అక్కడ ఉన్న లాకర్‌ను పట్టుకొని పరారయ్యారు.ప్రాథమిక అంచనా ప్రకారం.. లాకర్‌లో సుమారు 20 తులాల బంగారం ఉన్నట్లు సమాచారం.
మంగళవారం ఉదయం ఇంటి తాళాలు పగిలి ఉండటాన్ని గమనించిన స్థానికులు, వెంటనే యజమానికి, ఆపై పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మూడో టౌన్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ను రప్పించి, వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
