హైదారాబాద్ నగరంలో నేపాలీ ల ఆగడాలు ఆగడం లేదు ఐపిఎస్ అధికారి హత్య ..ప్రొఫెసర్ ఇంట్లో లూటీ ఉదంతాలు మరవక ముందే గచ్చిబౌలిలో మరో నేపాలీ ముఠా లూటీ వెలుగులోకి వచ్చింది.
గచ్చిబౌలి లోని అత్యంత ఖరీదైన హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో నేపాలీ ముఠా భారీ చోరీకి పాల్పడింది. నమ్మించి ఇంట్లో చేరిన దంపతులు, సుమారు కిలో బంగారం, విలువైన వజ్రాభరణాలతో పరారయ్యారు.
సుమారు నెల రోజుల క్రితం నేపాల్‌కు చెందిన దంపతులను సదరు వ్యాపారవేత్త పనిలో పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం వ్యాపారవేత్త కుటుంబం ముంబయి వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చి చూడగా, ఇంట్లో పని చేసే ఆ దంపతులు కనిపించలేదు.
ఇంటి తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో, వారు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారని యజమాని భావించారు. అయితే, కాసేపటికి పూజ గదిలో విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని, అల్మారాలను తనిఖీ చేశారు.
అందులో ఉండాల్సిన కిలో బంగారం, వజ్రాభరణాలు మాయమైనట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు. దీనిపై వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నేపాలీ దంపతులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన అధికారులు, విల్లాలోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులు ఎక్కడికి పారిపోయారో తెలుసుకునేందుకు సరిహద్దు రాష్ట్రాల్లోని పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.
