విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదానికి గురైన రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు.
బుధవారం నిజామాబాద్‌లోని బాధితుడి నివాసాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో ఇల్లు, గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమైన తీరును గంగాధర్‌ను అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదం జరిగిన తీరును విని విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉన్న కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని సూచించారు.
ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాన్ని త్వరితగతిన అందేలా చూస్తామని, సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశ వేణు, స్థానిక కాంగ్రెస్ నాయకులు విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
