- ఉద్యమ చరిత్రలో ఘన కీర్తి సాధించిన మోతే
- నాడు రాజకీయాలకతీతంగా ఒక్కటైన గ్రామం
- మాజీ సీఎం కేసీఆర్ కు మోతే సెంటిమెంట్
- ఉద్యమంలో మట్టి ముడుపు కట్టిన కేసీఆర్
- తెలంగాణ సాధన తర్వాత మోతెకు వరాల జల్లు
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఆ గ్రామం. ఉద్యమబాట పట్టిన కేసిఆర్ ను వెన్నుతట్టి ముందుకు నడిపింది.
రాజకీయాలకు అతితంగా, మేము సైతం.. అంటూ ఊరు ఊరంతా కదిలి వచ్చింది. ఉద్యమంలో ఆ గ్రామానికి వచ్చిన కేసీఆర్ ఆ ఊరి మట్టిని ముడుపు కట్టి తెలంగాణ సాధించినాక ముడుపు విప్పిన ఘన కీర్తి మూటకట్టుకుంది.
ఆనాటి ఉద్యమ నేత కెసిఆర్ కు సెంటిమెంట్ గా నిలిచిన ఆ గ్రామమే వేల్పూర్ మండలం మోతే.. పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన ఈ గ్రామం తెలంగాణ ఉద్యమ చరిత్రలో వార్తల్లో నిలిచింది.
మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేతగా గ్రామ గ్రామాన తెలంగాణ నాదం ఉవ్వెత్తిన ఎగియ కంటే ముందే తమ గ్రామానికి రావాలని మోతే గ్రామస్తులు ఆయనను ఆహ్వానించారు.
పార్టీలకు అతీతంగా తమ పదవులకు రాజీనామా చేసి ఊరంతా ఏకమై తెలంగాణ ఉద్యమానికి జై కొట్టారు. అప్పట్లో మోతే స్ఫూర్తితో మరికొన్ని గ్రామాలు కూడా అదే బాటలో ముందుకు వచ్చాయి. 2001వ సంవత్సరంలో జూన్ 5వ తేదీన మోతే కు వచ్చిన కెసిఆర్ ఇక్కడి రాజరాజేశ్వర ఆలయంలో మట్టిని ముడుపు కట్టారు.
తెలంగాణ సాధించేవరకు ముడుపు విప్పబోనని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 మార్చ్ 28వ తేదీన ఆ ముడుపును విప్పారు.
ఆ తర్వాత 2015లో సీఎం హోదాలో మరొకసారి మోతే గ్రామాన్ని కెసిఆర్ సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న నాటి సీఎం కేసీఆర్ ఆ గ్రామానికి వరాల జల్లు కురిపించారు.
-మోతే అభివృద్ధిలో కేసీఆర్ మార్క్
మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ మంత్రి , బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.
దివంగత వేముల సురేందర్ రెడ్డి స్ఫూర్తితో కెసిఆర్ ఈ గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించారు. పచ్చల నడ్కుడ చెరువు నుండి మోతే వరకు నీటిపారుదల కాలువను ₹3.82 కోట్లతో నిర్మించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీకి కొత్త కార్యాలయ భవనం, ప్రభుత్వ పాఠశాలకు అదనపు తరగతి గదులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.
మోతే గ్రామాన్ని ఇతర గ్రామాలకు అనుసంధానించడానికి బిటి రోడ్లు వేయబడ్డాయి. కప్పల వాగు, పెద్ద వాగులో చెక్ డ్యామ్ ల నిర్మాణంతో మోతే గ్రామంలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.
దీంతో అప్పట్లో మోతే గ్రామస్తులు కెసిఆర్ ను తన అధికారిక నివాసంలో కలిసి తెలంగాణ ఉద్యమం గురించి తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో మోతే మోగించిన తెలంగాణ మోత రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. కాబట్టి చరిత్ర పుటల్లో తనకంటూ ఒక పేజీని సంపాదించుకుంది ఈ గ్రామం.
