మున్సిపల్ ఎన్నికలలో కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో పోలైన ఓట్లను సంబంధిత కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ శుక్రవారం లెక్కింపు జరిపారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగగా, బోధన్ మున్సిపల్ కౌంటింగ్ విజయ మేరీ హైస్కూల్ లో, ఆర్మూర్ మున్సిపల్ ఓట్ల లెక్కింపు ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీంగల్ మున్సిపాలిటీ ఓట్లను భీంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొనసాగింది.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఎన్నికల అబ్జర్వర్ సీహెచ్. సత్యనారాయణ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర జిల్లా అధికారులు కౌంటింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరిపారు. ఉదయం 7.00 గంటల నుండే కౌంటింగ్ కోసం సన్నాహాలు చేపట్టారు.
ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో కలెక్టర్ నేతృత్వంలో కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించి, ఆ జాబితా ప్రకారంగా సిబ్బందిని ఆయా టేబుళ్ల వద్ద ఓట్ల లెక్కింపు బాధ్యతలు కేటాయించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన మీదట, స్ట్రాంగ్ రూమ్ ల నుంచి క్రమ సంఖ్యలో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించి, ఓట్లను లెక్కిస్తూ రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించారు.
ముందస్తుగానే టేబుళ్ల వారీగా కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, సూక్ష్మ పరిశీలకులతో పాటు స్ట్రాంగ్ రూంల నుండి వెంటదివెంట బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించేలా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ, జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరుపుతూ ఫలితాలు వెల్లడించారు.
మధ్యాహ్నం సమయానికే జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు పూర్తవగా, అత్యధికంగా 60 డివిజన్లు కలిగి ఉండడం వల్ల నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగింది. అన్ని అంశాలను సరిచూసుకున్న మీదట రిటర్నింగ్ అధికారులు ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
కాగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర ఉన్నతాధికారులు కౌంటింగ్ కేంద్రాలను సందర్శిస్తూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, నిషేధాజ్ఞలు అమలు చేశారు. కౌంటింగ్ కేంద్రం లోనికి ఇతరులెవరిని అనుమతించలేదు.
కౌంటింగ్ సిబ్బందితో పాటు వివిధ బాధ్యతలు నిర్వర్తించిన సిబ్బందికి ఎంట్రీ పాసులు జారీ చేసినప్పటికీ, వారిని సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేసి కౌంటింగ్ విధులకు పంపించారు. సెల్ ఫోన్ లు, వీడియోలు, కెమెరాలను నిషేధించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ట్రాన్స్కో సిబ్బంది చర్యలు తీసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో పూర్తి పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను జరిపించారు.
