మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, ఇతరుల భద్రతకు విఘాతం కలిగిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి న్యాయస్థానం వారం రోజుల జైలు శిక్ష విధించగా, మరో ఆరుగురికి భారీగా జరిమానా విధించింది.
ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు నగరంలో నిర్వహించిన తనిఖీల్లో ఎనిమిది మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరికి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పి. ప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం శుక్రవారం వీరిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ఎదుట హాజరుపరిచారు.
కేసును విచారించిన మేజిస్ట్రేట్, ఆరుగురికి కలిపి మొత్తం 60,000 రూపాయల జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమించిన షేక్ జబ్బార్ (వేకర్ కాలనీ, జైనూర్, ఆదిలాబాద్ జిల్లా), పత్రి ప్రశాంత్ (మిర్చి కాంపౌండ్, నిజామాబాద్) అనే ఇద్దరు వ్యక్తులకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
