వ్యాధి పట్ల ముందస్తు అవగాహన, సరైన సమయంలో చికిత్స అందడం ద్వారానే హిమోఫీలియా బాధితులు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టరు కృష్ణమోహన్ పేర్కొన్నారు.
ప్రపంచ హిమోఫీలియా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది హిమోఫీలియా నివారణపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఈ వ్యాధిపై సమాజంలో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
హిమోఫీలియా నోడల్ ఆఫీసర్ డాక్టరు పవన్ మాట్లాడుతూ.. గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టకపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణమని, దీనిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య సలహాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను బాధితులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టరు రాములు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టరు తిరుపతి రావు, డాక్టరు కిషోర్ కుమార్, వివిధ విభాగాల వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ కళాశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
