- ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు
- షోకాజ్ నోటీసులకు స్పందించని వైనం
- డీఎంఈ నరేంద్రకుమార్ కీలక ఉత్తర్వులు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వైద్య విద్య డైరెక్టరేట్ వేటు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా సుదీర్ఘ కాలంగా విధులకు గైర్హాజరవుతున్న వీరిని సర్వీసు నుంచి తొలగిస్తూ డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. తొలగింపునకు గురైన వారంతా 2022 నుంచి 2024 మధ్య కాలంలో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా విధుల్లో చేరారు. అయితే, ఇతర ప్రాంతాలకు చెందిన వీరు విధులకు హాజరుకావడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. కనీసం ముందస్తు అనుమతి తీసుకోకుండానే విధులకు దూరంగా ఉంటుండటంతో బోధనతో పాటు రోగులకు వైద్య సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న వీరిపై గతంలోనే కళాశాల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని గతంలోనే వీరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ సదరు వైద్యులు విధుల్లో చేరకపోవడమే కాకుండా, కనీసం సమాధానం కూడా ఇవ్వకపోవడంతో డీఎంఈ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
తొలగింపునకు గురైన వారు వీరే:
- డాక్టర్ అయేషా పర్హీన్
- డాక్టర్ జి. స్రవంతి
- డాక్టర్ పి. నిశిత
- డాక్టర్ నీలకంఠం సతీష్ రాజు
- డాక్టర్ ఆర్. లక్ష్మణ్
- డాక్టర్ ఎం. అపూర్వ
- డాక్టర్ పి. లీలావతి
వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని అధికారులు ఈ చర్య ద్వారా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
