Monday, April 20, 2026
HomeTelanganaNizamabadనిజామాబాద్ అభివృద్ధిలో కొత్త అధ్యాయం: ​నగర అభివృద్ధిలో తమదైన మార్కు చూపాలి: మేయర్, డిప్యూటీ మేయర్‌గా...

నిజామాబాద్ అభివృద్ధిలో కొత్త అధ్యాయం: ​నగర అభివృద్ధిలో తమదైన మార్కు చూపాలి: మేయర్, డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన కూరగాయల ఉమారాణి, సల్మా తహసీన్..రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

నిజామాబాద్ నగర పాలక సంస్థలో కొత్త అధ్యాయం మొదలైందనీ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.నిజామాబాద్ సమగ్ర అభివృద్ధికి నూతన పాలక వర్గం కట్టుబడి ఉండాలని, నగర అభివృద్ధిలో తమదైన మార్కు చూపాలనీ పిలుపునిచ్చారు.నిజామాబాద్ నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా కూరగాయల ఉమారాణి, డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, వారిద్దరితో పదవీ బాధ్యతలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజామాబాద్ నగర అభివృద్ధిలో నూతన పాలక వర్గం తమదైన ముద్ర వేయాలని ఆకాంక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పురపాలక సంఘాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. “నిజామాబాద్ అభివృద్ధికి ప్రజాపాలన యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుంది.

ప్రజల ఆశయాలకు అనుగుణంగా మేయర్, డిప్యూటీ మేయర్లు పనిచేయాలి” అని ఆయన సూచించారు. నేడు ప్రత్యేకమైన రోజని గుర్తు చేస్తూ, 2014లో ఇదే రోజున రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయిందని మంత్రి స్మరించారు. సోనియా గాంధీ కృషితోనే తెలంగాణ స్వప్నం సాకారమైందని, 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను 2047 విజన్‌తో దేశంలోనే అగ్రభాగంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

గత పదేళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల అంశాలను విస్మరించి ప్రజల ఆశలను నీరుగార్చారని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు. రెండు సార్లు బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రాన్ని విస్మరించారని, అనేక అభివృద్ధి బిల్లులను పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. “14 ఏళ్లు వనవాసం ఉంటుంది..

కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతున్నా రాష్ట్రంపై చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికైనా ఇక్కడి నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెలలోనే సబ్ కమిటీ వేస్తామని, వారికి 250 గజాల స్థలంతో పాటు ఇతర హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రితో చర్చించారని వెల్లడించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!