మహారాష్ట్ర నుంచి నిషేధిత గంజాయిని దిగుమతి చేసుకుని, జిల్లాలోని యువతను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను బాల్కొండ పోలీసులు పట్టుకున్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ఆరుగురు నిందితులు పట్టుబడగా.. ప్రధాన సూత్రధారి సహా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు..శుక్రవారం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
బాల్కొండ శివారులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో గంజాయి విక్రయం జరుగుతున్నట్లు గుర్తించారు. సి.ఐ.జాన్ రెడ్డి, ఎస్.ఐ. శైలేందర్ నేతృత్వంలోని బృందం తెల్లవారుజామున నిందితులను చుట్టుముట్టింది. పెర్కిట్‌కు చెందిన పాత నేరస్తుడు ఎండీ అంజాద్ అలీ నేతృత్వంలో నయీమ్, అద్నాన్, మనోజ్, గోవిందు, ఒక బాలుడు గంజాయిని ప్యాక్ చేసి విక్రయించేందుకు సిద్ధంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు.
ప్రధాన నిందితుడు అంజాద్ అలీ గతంలోనూ పలుమార్లు వేల్పూర్, ఆర్మూర్ ప్రాంతాల్లో గంజాయి కేసుల్లో జైలుకు వెళ్ళాడనీ అన్నారు. అయినా తీరు మార్చుకోకుండా ఈసారి తన తమ్ముడు వహీద్ సుల్తాన్‌తో కలిసి ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు.
మహారాష్ట్రలోని కిన్వాత్‌కు చెందిన మున్ని అనే మహిళ వద్ద కిలో గంజాయిని కేవలం ₹20,000/- కే కొనుగోలు చేస్తున్నాడు. ఆ గంజాయిని ఆర్మూర్, బాల్కొండ పరిసరాల్లో 5 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి, ఒక్కో ప్యాకెట్‌ను ₹400 నుంచి ₹500 వరకు విక్రయిస్తున్నాడను తెలిపారు.
గంజాయి అమ్మిన ప్రతి ప్యాకెట్‌పై ఏజెంట్లకు రూ 100 చొప్పున కమీషన్ ఆశ చూపి యువతను ఈ ఊబిలోకి లాగుతున్నాడనీ పేర్కొన్నారు. నిందితుల నుంచి 1.2 కిలోలు ఎండు గంజాయి:(విలువ సుమారు ₹30,000/-) స్మార్ట్ ఫోన్లు 6 (టెక్నాలజీ సాయంతోనే ఆర్డర్లు!), ఒక హీరో ప్యాషన్ ప్రో బైక్, ప్యాకింగ్ కోసం వాడే జిప్ లాక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ దందాలో బాల నేరస్తుడిని వాడుకున్నందుకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.అలాగే పరారీలో ఉన్న మున్ని, వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ ల కోసం గాలింపు ముమ్మరం చేశారనీ అన్నారు.డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసి ముఠాను పట్టుకున్న ఆర్మూర్ రూరల్ సీఐ జి. జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్సై కె. శైలేందర్, సిబ్బంది శంకర్, భరత్ గౌడ్, నవీన్, ఇతర సిబ్బందిని సీపీ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు.
