Monday, April 20, 2026
HomeTelanganaNizamabadఎకరం లోపు వారికే 'భరోసా'.. మిగతా రైతులకు ఎదురుచూపులేనా?సాగు కాలం ముగిశాక సాయం.. అది కూడా...

ఎకరం లోపు వారికే ‘భరోసా’.. మిగతా రైతులకు ఎదురుచూపులేనా?సాగు కాలం ముగిశాక సాయం.. అది కూడా అరకొరగానే!

రెండో విడతపై వీడని ఉత్కంఠ.. ఏప్రిల్‌ వరకు ఆగాల్సిందేనా?అన్నదాతకు అండగా ఉంటామని ప్రకటించిన ‘రైతు భరోసా’ పథకం అమలు తీరు ఇప్పుడు క్షేత్రస్థాయిలో గందరగోళానికి దారితీస్తోంది. సాగు పనులు మొదలైనప్పుడు చేతికందాల్సిన పెట్టుబడి సాయం, తీరా కోతలు పూర్తయ్యే దశలో విడుదల కావడంపై రైతాంగం మండిపడుతోంది.

అది కూడా కేవలం ఎకరం లోపు భూమి ఉన్న వారికే నిధులు జమ కావడంతో, మెజారిటీ రైతులు తమ పరిస్థితి ఏంటని దిక్కులు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎకరం లోపు విస్తీర్ణం కలిగిన 2,69,476 మంది రైతులకు గాను ప్రభుత్వం తొలి విడతలో 134.95 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

వీరికి ఎకరాకు రూ.6 వేల చొప్పున సాయం అందింది. అయితే, అత్యధిక శాతం ఉన్న ఎకరం పైబడిన రైతులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మొదటి విడతలోనే తమకు వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది.తొలి విడత పంపిణీ తర్వాత మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ లభించడం లేదు.

రెండో విడతలో కొంతమందికి మాత్రమే సాయం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ నెలాఖరు వరకు మిగిలిన అందరికీ నిధులు జమ చేస్తామని ప్రభుత్వం గడువు విధించింది. అంటే సాగు పూర్తయి, చేతికి వచ్చిన పంట అమ్ముకున్న తర్వాత ఈ నిధులు ఇచ్చి ఏం లాభమని రైతులు ప్రశ్నిస్తున్నారు.

“పెట్టుబడి కోసం వడ్డీలకు అప్పులు తెచ్చాం, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సాయం ఆ వడ్డీలకు కూడా సరిపోదు” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతలో ఎంతమందిని ఎంపిక చేస్తారు భూమి విస్తీర్ణం పరిమితి ఎంత ఉంటుంది అన్న విషయాలపై సర్కారు మౌనం వహిస్తోంది.

కేవలం ఎకరం లోపు వారికే ఇచ్చి చేతులు దులుపుకుంటుందా లేక అందరికీ పంపిణీ చేస్తుందా అన్న సందేహాలు రైతుల్లో బలపడుతున్నాయి. గడువును ఏప్రిల్‌ వరకు పొడిగించడం అంటే, నిధుల కొరతను సాకుగా చూపి జాప్యం చేయడమేనని విపక్షాలు, రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, విడతల పేరుతో కాలయాపన చేయకుండా రైతులకు తక్షణమే పూర్తిస్థాయిలో భరోసా నిధులు విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!