నిజామాబాద్ నగరాన్ని అన్ని హంగులతో, ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నగర ప్రగతి విషయంలో రాజకీయాలకు తావులేదని, అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
నిజామాబాద్ పట్టణం కరీంనగర్ కంటే ముందే ఏర్పడిన ఘన చరిత్ర కలిగిన పట్టణమని, దానికి తగ్గట్టుగా నగరం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
నిజామాబాద్ నగర మాస్టర్ ప్లాన్‌ను యుద్ధప్రాతిపదికన, మూడు నెలల్లోపు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ‘అమృత్ సిటీ’ని ‘స్మార్ట్ సిటీ’గా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
నగర విస్తరణను దృష్టిలో ఉంచుకుని, పాత అవతార్ రింగ్ రోడ్డుకు బదులుగా.. నగరంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ పూర్తిస్థాయిలో కొత్త రింగ్ రోడ్డు నిర్మించేలా ప్రతిపాదనలు పంపాలని సూచించినట్లు వెల్లడించారు.
నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, నగర భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని, పాలక, ప్రతిపక్ష పార్టీలన్నీ నగరాభివృద్ధికి సానుకూలంగా స్పందించడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అభివృద్ధి పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై కౌన్సిలర్లు, అధికారులతో విస్తృతంగా చర్చించినట్లు ఆయన తెలిపారు.
