HomeLaw and Orderలే అవుట్ ఓపెన్ స్పేస్‌లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు... నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..బడులు,...

లే అవుట్ ఓపెన్ స్పేస్‌లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు… నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..బడులు, అంగన్వాడీ కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. ప్రమాదాలు జరుగకుండా పాడుబడిన బావులను పూడ్చివేయించాలి..ఎం.పీ.ఓలతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి…

లే అవుట్ ప్లాట్లకు సంబంధించిన ఓపెన్ స్పేస్‌లలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

నిబంధనలను అతిక్రమిస్తూ ఎవరైనా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం మండల పంచాయతీ అధికారుల (ఎం.పి.ఓలు)తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

లే అవుట్‌లలో ప్రజా అవసరాల కోసం 10 శాతం మేరకు కేటాయించబడిన ఓపెన్ స్పేస్‌లు, పార్కులు, ఇతర సామూహిక వినియోగ స్థలాలను పరిరక్షించడం అధికారులు, స్థానిక సంస్థల బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా వాటిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎం.పీ.ఓలను ఆదేశించారు.

పలుచోట్ల ఓపెన్ స్పేస్ లలో నిర్మాణాలు జరుగుతున్నాయని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని, సంబంధిత ఎం.పీ.ఓలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టే వారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదని, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని సూచించారు.

ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు ఆస్కారం కల్పించినా సంబంధిత మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి మండలంలో లే అవుట్ ఓపెన్ స్పేస్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, ఎక్కడైనా ఆక్రమణలు లేదా అనధికార నిర్మాణాలు గుర్తిస్తే వెంటనే నోటీసులు జారీ చేసి, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

కాగా, నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పాములు, తేళ్ళు, ఇతర విష కీటకాల బారిన పడి విద్యార్థులు ప్రమాదాలకు లోను కాకుండా బడులు, అంగన్వాడి సెంటర్ల పరిసరాలలో పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు వంటివి ఉన్నట్లయితే వెంటనే వాటిని శుభ్రం చేయించాలని అన్నారు.

సర్పంచ్ లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రజలను భాగస్వాములు చేస్తూ అవసరమైతే శ్రమదానం చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ఎక్కడైనా నిరుపయోగంగా పాడుబడిన బావులు ఉంటే, తక్షణమే వాటిని పూడ్చివేయించాలని, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.

అపరిశుభ్ర పరిసరాల వల్ల ఎక్కడైనా విద్యార్థులు ఎవరైనా ప్రమాదానికి గురైతే సంబంధిత ఎం.పీ.ఓలు, పంచాయతీ కార్యదర్శులను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, అన్ని మండలాల ఎం.పీ.ఓలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments