ఒలింపిక్ రన్‌లో క్రీడాకారుల సమస్యలపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారం రోజుల్లో ఇండోర్ స్టేడియం ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేస్తామని హామీనిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో కోచ్‌లు, సరైన క్రీడా మైదానాలు లేకపోయినా జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ జిల్లాకు గుర్తింపు తీసుకొస్తున్నారని తెలిపారు.
అయితే వారికి తగిన ప్రోత్సాహం, మౌలిక వసతులు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఆధునిక స్టేడియాలు, కోచ్‌లను ఏర్పాటు చేసి క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు.క్రీడాకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని స్టేడియాలు, కోచ్‌లను ఏర్పాటు చేస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
దీనిపై వెంటనే స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర క్రీడల మంత్రితో ఫోన్‌లో మాట్లాడి నిజామాబాద్ జిల్లాలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి, రూ.5 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తామని తెలిపినట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
అలాగే వారం రోజుల్లో స్టేడియం ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ ప్రకటనతో హర్షం వ్యక్తం చేసిన జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు భక్తవత్సలం, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్యతో పాటు రాజ గౌడ్ జావిద్.
నాంచారి శీను వాసు సంఘ ప్రతినిధులు మహేష్ కుమార్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని జిల్లా ఒలింపిక్ సంఘ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
