HomeTelanganaNizamabadవీడీసీ లకు చట్టబద్ధత ఎక్కడిది?గ్రామ అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలి..తాళ్లరాంపూర్‌ బాధితులకు న్యాయం చేయాలి:...

వీడీసీ లకు చట్టబద్ధత ఎక్కడిది?గ్రామ అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలి..తాళ్లరాంపూర్‌ బాధితులకు న్యాయం చేయాలి: విద్యార్థి సంఘాల డిమాండ్

గ్రామ అభివృద్ధి కమిటీలు పేరుతో సమాంతర వ్యవస్థలు నడపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, చట్టబద్ధత లేని గ్రామ అభివృద్ధి కమిటీలను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. తాళ్లరాంపూర్‌ గ్రామంలోని బాధితుల హక్కులను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని కోరింది.

ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో తాళ్లరాంపూర్‌ గ్రామ అభివృద్ధి కమిటీ బాధితులకు మద్దతుగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్‌, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కర్క గణేష్‌, బీవీఎం రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ శ్రీధర్‌ మాట్లాడారు.

రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే గ్రామ అభివృద్ధి కమిటీ వ్యవస్థకు వంతపాడటం సరికాదన్నారు. తాళ్లరాంపూర్‌ బాధితుల ఆర్తనాదాలు ఎంపీ ధర్మపురి అరవింద్‌, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు వినిపించడం లేదా అని ప్రశ్నించారు.

ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌, నిర్మల్‌ ప్రాంతాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలు సమాంతర వ్యవస్థలుగా వ్యవహరిస్తున్నా రాజ్యాంగబద్ధ సంస్థలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీలపై నమోదైన కేసుల్లో ఇప్పటివరకు అభియోగపత్రాలు దాఖలు చేయకపోవడం పోలీసుల వైఫల్యమేనని ఆరోపించారు.

కమిటీల ఆగడాలకు అడ్డుకట్ట వేసి బాధితుల మానవ హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. తాళ్లరాంపూర్‌లో పోలీసు, న్యాయ వ్యవస్థలతోపాటు భారత రాజ్యాంగాన్ని కాపాడి నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్‌చారికి వినతిపత్రం అందజేశారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన ఆయన డీజీపీతో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు రఘురామ్‌నాయక్‌, ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకుడు శ్రీదీప్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సుబోధ్‌, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర, నాగరాజు, గ్రామ అభివృద్ధి కమిటీ బాధితులు నారాయణగౌడ్‌, సుదర్శన్‌, నర్సాగౌడ్‌, దేవదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments