తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కనుగొనడం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా జిల్లాలో జనవరి 1 నుంచి ‘ఆపరేషన్ స్మైల్-XII’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి వెల్లడించారు.
సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు జనవరి 31 వరకు నెల రోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో 18 ఏళ్ల లోపు తప్పిపోయిన పిల్లల సమాచారాన్ని సేకరించి, వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతి డివిజన్‌కు ఒక ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్‌తో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే ప్రతి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ధాబాలు, హోటళ్లు, ఫ్యాక్టరీలలో తనిఖీలు నిర్వహించి బాలకార్మికులను గుర్తించనున్నారనీ అన్నారు.పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయించినా, వెట్టిచాకిరీకి గురిచేసినా సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని మహిళా భద్రతా విభాగానికి నివేదిస్తామన్నారు. తప్పిపోయిన పిల్లల గురించి గానీ, బాలకార్మికుల గురించి గానీ సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 నిజామాబాద్ ఎస్‌ఐ (రాజేశ్వర్): 87125 77816 ఆర్మూర్ ఎస్‌ఐ (ఇంద్రకరణ్ రెడ్డి): 94401 40022 బోధన్ ఎస్‌ఐ (పీటర్): 94405 66595 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్‌బీ సీఐ అంజయ్య, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ సంపూర్ణ, లేబర్ ఆఫీసర్ ప్రభుదాస్, హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి రాజు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య, ఏహెచ్‌టీయూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
