ఇతర విభాగాల వారికి అధ్యక్ష పదవి అనర్హత ప్రకటించాలని విజ్ఞప్తి..ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న ఉత్కంఠ నిజామాబాద్ పోలీసు సంఘం ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఎన్నికల నిర్వహణపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఇప్పటికే కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి.. మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇతర విభాగాలకు చెందిన వారు అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అనర్హత నిబంధనను స్పష్టంగా అమలు చేయాలని కోరుతున్నారు.
దాదాపు 12 ఏళ్ల తర్వాత పోలీసు సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా 40 మంది సభ్యులను ఎన్నుకుని, అనంతరం ఈ నెల 27న అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించారు.
అయితే అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హతపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఎన్నికల ప్రక్రియపై వివాదం తలెత్తింది. సంఘానికి సంబంధించిన విభాగంలో పనిచేసే వారికే అధ్యక్ష పదవికి అవకాశం ఉండాలని పలువురు సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం జరిగిన ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి.. అర్హతలు, నిబంధనలను స్పష్టం చేస్తూ మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష పీఠంపై ఆసక్తిపోలీసు సంఘానికి దాదాపు 12 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో అధ్యక్ష పదవిపై పలువురు ఆసక్తి చూపుతున్నారు.
అయితే అర్హత అంశం తెరపైకి రావడంతో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. సభ్యుల డిమాండ్లపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
నిబంధనలను స్పష్టం చేసి.. కొత్తగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే అధ్యక్ష పదవికి పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
