వివాహేతర సంబంధం కొనసాగించడంపై జరిగిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. మృతుడిని పథకం ప్రకారం ఇంటికి రప్పించి గొంతు నులిమి హత్య చేసిన ఘటనలో మహిళ సహా ఏడుగురిని మంగళ్‌హట్ పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి ఆరు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ జోన్ అదనపు డీసీపీ బి.కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ధూల్‌పేట్ శివ్‌లాల్‌నగర్‌కు చెందిన సాయినాథ్‌సింగ్ (24)కు చిడియావాలే అనిషా సింగ్ (25)తో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అనిషా కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ సాయినాథ్ ఆమెను సోషల్ మీడియా ద్వారా సంప్రదించడం, కలవాలని ఒత్తిడి చేయడం కొనసాగించినట్లు పేర్కొన్నారు. దీంతో అతడిని హతమార్చాలని అనిషా, ఆమెకు సంబంధించిన వారు నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.
ఈ క్రమంలో సెప్టెంబరు 28న సాయినాథ్‌ను మంగళ్‌హట్ రహీంపురాలోని అనిషా తల్లి ఇంటికి రప్పించారు. అక్కడ అతడిపై దాడి చేసి అనిషా చున్నీతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం మృతుడి సోదరి సోనీ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో మంగళ్‌హట్ పోలీసులు క్రైం నంబర్ 88/2026లో బీఎన్‌ఎస్ 103(1) రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు. సెప్టెంబరు 30న అందిన సమాచారం ఆధారంగా అనిషా సింగ్, మాఖన్ బాదల్‌సింగ్ (24), ఆకాష్‌సింగ్ (21), అభిషేక్ (23), పూజారి లఖన్‌సింగ్ (33), అక్షయ్‌సింగ్ అలియాస్ అక్షయ్ (30), దేగన్ నందిత (24)లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నారు. అనిషా సింగ్‌పై 2023లో మంగళ్‌హట్ పోలీస్‌స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. మాఖన్ బాదల్‌సింగ్‌పై మంగళ్‌హట్ పీఎస్‌లో 2024 నుంచి 2026 వరకు టీఎస్‌జీఏ, టీఎస్‌ఈఏ చట్టాల కింద ఎనిమిది కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
లఖన్‌సింగ్‌పై 2009లో బేగంబజార్ పీఎస్‌లో ఐపీసీ 324 కింద, 2023లో మంగళ్‌హట్ పీఎస్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదైనట్లు తెలిపారు.ఈ కేసు దర్యాప్తును గోల్కొండ జోన్ డీసీపీ జె. రాఘవేందర్‌రెడ్డి, కుల్సుంపురా ఏసీపీ వి. తిరుపతి పర్యవేక్షణలో మంగళ్‌హట్ ఎస్‌హెచ్‌ఓ ఎస్. రాఘవేంద్ర, డీఐ పి. మహేందర్, ఎస్‌ఐ బి. నరేష్, సిబ్బంది చేపట్టారు.
