ఒకప్పుడు పచ్చని పంటలతో కళకళలాడిన పొలాలు.. నేడు పరిశ్రమ నుంచి వెలువడుతున్న విషపూరితమైన కాలుష్యానికి నల్లబారుతున్నాయి. పరిశ్రమ చిమ్ముతున్న విషానికి, సాగు చేసిన పంటలు పాడై పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది.
నగర శివారులోని కాలుర్ ఒక పారిశ్రామిక కేంద్రం. ఈ ప్రాంతంలోని భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోయాయని… ప్రమాదకరమైన పారిశ్రామిక వ్యర్థాలు భూమిలోకి ఇంకడం వల్లే పంటలు కూడా పండని విధంగా విషతుల్యమై పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
కాలూర్ గ్రామ శివారులో గల సుంకరి మల్కన్న సర్వే నెం.687 గల తన వ్యవసాయ భూమిలోకి రైస్ మిల్లులనుంచి స్టీమ్ రైక్స్ మిల్లింగ్ చేయగా ఏర్పడే మురికి నీరును వదులుతున్నారని సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు అర్జీ అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర శివారులోని గుండారం దగ్గర గల వాసుదేవ ఆగ్రో ఇండస్ట్రీ, అయ్యప్ప ఆగ్రో ఇండస్ట్రీ.అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీ. కామాక్షి కోల్డ్ స్టోరేజ్,భూవనేశ్వరీ అగ్రో ఇండస్ట్రీ, లక్ష్మిబాలాజీ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల నుంచి స్టీమ్ రైక్స్ మిల్లింగ్ చేయగా ఏర్పడే మురికి నీరు మొత్తంను పంటపొలాలలో వదులుతున్నారనీ వాపోయారు.
ఆ మురికి నీరు చూడడం వల్ల పంట పండిచుకోలేకపోతున్నామనీ ఆవేదన వ్యక్తంచేశారు. దీని వలన మాకు తీరని నష్టం జరుగుతున్నదనీ పేర్కొన్నారు.చిన్న రైతులము, మాకు ఈ భూములు తప్ప ఎటువంటి ఆధారము లేదనీ తెలిపారు.ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం..
ఇక్కడి రసాయన పరిశ్రమల కాలుష్యంపై స్థానికులు, రైతులు కాలుష్య నియంత్రణ జిల్లా,మండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదనీ అన్నారు.
ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా హడావిడి చేసి చేతులు దులుపుకోవడం తప్ప, ఏ ఒక్క పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు మచ్చుకైనా కనిపించడం లేదనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు తుంగలో తొక్కి జనం పైకి విషం చిమ్ముతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే పరిశ్రమల యాజమాన్యాలు ముట్టజెప్పే అమ్యామ్యాలకు అలవాటు పడి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టించుకోని పాలకులు… కన్నెత్తి చూడని అధికారులు ఏళ్లుగా రైతుల రోధనలను పాలకులు పట్టించుకోవడం లేదు. రైతులు మాత్రం పంటలు పండక అప్పులపాలై కన్నీళ్లతో కాలం గడుపుతున్నారు.
ప్రతి ఏడాది పంట నష్టం జరుగుతుంది. ఆయన పాలకులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండగా.. కాలుష్య నియంత్రణ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
