ప్రైవేటు స్కూల్ బస్సులు మా ఊరిలోకి రావొద్దు,మా పిల్లలను సర్కారు బడిలోనే చదివిస్తాం అని కమ్మర్ పల్లి మండలం నాగపూర్ గ్రామ అభివృద్ది కమిటీ తీర్మానం చేసినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బసిరి అశోక్ బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీ,యు పి ఎస్ పాఠశాల యాజమాన్యం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ ఏర్పాటు చేసి తీర్మాణించినట్లు తెలిపారు.సర్కార్ పాఠశాలలో సకలవసతులతో డిజిటల్ తరగతులు, అన్ని రకాల పోషక ఆహారాలతో మధ్యాహ్న భోజనం, ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అధిక ఫీజులు వసూల్ చేయడంతో ఆవేదన చెందిన నిరు పెద,మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలను తల్లి దండ్రులు సర్కార్ పాఠశాలలో చదివించేందుకు గ్రామ సభలో ఏక గ్రీవంగా తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో యుపిఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కిషన్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఖాంధేశ్ సంధ్య,మహిళా సంఘం అధ్యక్షులు బట్టు బాలహంస,గ్రామ ప్రజలు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
