HomeTelanganaNizamabadమురుగు కాల్వల రోడ్లు.. నిత్య నరకం..గంగాగాయత్రినగర్ వాసుల గోడు..

మురుగు కాల్వల రోడ్లు.. నిత్య నరకం..గంగాగాయత్రినగర్ వాసుల గోడు..

నగర శివారులోని ముబారక్ నగర్ సమీపంలో ఉన్న లక్ష్మీప్రియనగర్ పరిధిలోని గంగాగాయత్రినగర్ కాలనీవాసులు డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంతో కాలనీ ప్రజలు అడుగు తీసి అడుగు వేయలేని దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో, రోడ్లపైనే మురుగు నీరు ఏరులై పారుతోంది.కాలనీవాసులు డ్రైనేజీ సమస్యపై సోమవారం జిల్లా కలెక్టరుకు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీలో మురుగు నీరు నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు దోమల వృద్ధి పెరిగి, స్థానికులు తీవ్ర అభద్రతా భావంతో గడుపుతున్నారు.

డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని చిన్నారులు, వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో కాలనీవాసుల భయం మరింత రెట్టింపు అవుతోంది. ‘పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగలేక, అడగలేక విసిగిపోయాం’ అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్య తీవ్రతను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు. నిధులున్నా, ప్రణాళికలున్నా తమ కాలనీ సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ శాఖ నుంచి కనీస సాయం అందక, తప్పనిసరి పరిస్థితుల్లో కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సొంత డబ్బులతో రోడ్లపై మట్టి పోయడం, మోటార్లు పెట్టి మురుగునీటిని తరలించడం వంటి పనులు చేస్తున్నారు. “మేము పన్నులు కడుతున్నాం, మరి మా సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు?” అని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు.

కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యను పరిశీలించాలి. కాలనీలో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే, పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments