మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ధీర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు ఇందూరు నగరంలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా శ్రీ ఛత్రపతి శంభాజీ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, శివాజీ మహారాజ్ పరాక్రమాన్ని స్మరించుకున్నారు.
నగరంలోని వినాయక నగర్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ పులాంగ్ మీదుగా, రాజా రాజేంద్ర చౌరస్తా మార్గం గుండా పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు కొనసాగింది. యువత శివాజీ మహారాజ్ నినాదాలతో నగరాన్ని హోరెత్తించారు.
అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ సమీపంలోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి శంభాజీ వాకింగ్ గ్రూప్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. 1630 ఫిబ్రవరి 19న జన్మించిన శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్య స్థాపన కోసం చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు.
ఆయన చూపిన బాటలో నడవడం నేటి తరానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రూప్ సభ్యులకు, నగర వాసులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శంభాజీ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు దుర్గి సురేంధర్ గౌడ్, గౌరవ అధ్యక్షులు భరత్ భూషణ్, కోశాధికారి గంగిశెట్టి సంతోష్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సహా గ్రూపుకు చెందిన 30 మంది సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
